ప్ర:) భర్తను వశం చేసుకోవడానికి భర్త ప్రేమ పొందడానికిి ద్రౌపది చెప్పిన చిట్కాలు
జ:) సత్యభామతో ద్రౌపది ఇలా చెప్పింది
"పాండవుల పట్ల నేనెటువంటి దానినై వ్యవహరించి భర్తల ప్రేమను పొందుతున్నానో నీకు చెపుతాను విను.
మంత్ర,తంత్రాలతో, మందులు మాకులతో భర్త వశం అవుతాడనుకోవడం తెలివి తక్కువతనం మాత్రమే. దాని వలన భార్యపై భర్తకు అంతకు ముందు ఏర్పడిన అనురాగం ప్రేమ కూడా నశిస్తుంది. ఎట్టి లాభం కలుగదు. అట్టి భార్యతో కాపురం చేయటం పాముతో స్నేహం చేయటం వంటిదే అని భర్త భావిస్తాడు.
భర్త తనకు లోబడి ఉండాలనే భావంతో భార్య వశీకరణ తంత్రాలు మందులు మాకులు ప్రయోగిస్తే అవి బెడిసికొట్టి భర్తకు మూగతనం, మనస్సు శరీరం మొద్దుబారడం ఇటువంటి కష్టాలు వస్తాయి. ఆమెకు లోకంలో అపకీర్తి వస్తుంది. ఇదంతా ఆమె స్వయంకృతాపరాధమే కాబట్టి ఆమెకు తుదకు ప్రాప్తించేది నరకయాతన మాత్రమే.
భార్య ఎప్పుడూ భర్త విషయంలో మోసపు పనులు చేయకూడదు. భర్త అభిప్రాయాలు తెలుసుకుని దానికనుగుణంగా భార్య నడుచుకోవాలి. అట్టి అనుకూల దాంపత్యమే సకల రీతుల భర్తను ఆకట్టుకునే విధానమని గ్రహించాలి.
భర్తలు అన్యకాంతల యెడల అనురక్తులై వారిని కూడినప్పటికీ నేను కోపం చెందను. ఎప్పుడును స్వాతిశయం చూపక, ఎల్లప్పుడూ భర్తలయెడ వినయంతో పూజ్యభావంతో వారికి సేవ చేస్తాను. వింత పనులు చేయను. వింత మాటలు మాట్లాడను. పరపురుషులు దేవతలైనా సరే యక్షులైనా సరే పరపురుషులైన వారిని గడ్డి పోచతో సమానంగా చూస్తాను. స్నానం, భోజనం, పడక మొదలైన సౌకర్యాలను మెదట భర్తలకు ఏర్పరచి తర్వాత నేను అనుభవిస్తాను. భర్తలు ఇంటికి విచ్చేసినప్పుడు వారు కడుగుకోవటానికి నీరు కూర్చోవటానికి ఆసనాలు నేనే స్వయంగా ఏర్పాటు చేస్తానుగాని సేవకులను ఉపయోగించను.
నా భర్తలకు ఆయా సమయాలలో నిర్ణీత పద్దతి తప్పకుండా స్నానం ఆహారం మెదలైన సదుపాయాలను నేనే స్వయంగా సమకూరుస్తాను. ధాన్యం కాని ధనం కాని వ్యర్థం కానీయను. అనవసరంగా ఖర్చు పెట్టను. ఇళ్ళు, వాకిళ్ళు, పాత్రలు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేటట్లుగా మరపు, ఏమరపాటు లేకుండా సదా చూసుకుంటాను. చుట్టాలందరికీ సదా సంతోషం కలిగిస్తాను.
పలుమార్లు ఇంటి గుమ్మం దగ్గర, ఇంటి ముంగిట్లోనూ తిరుగుతూ ఉండటం, చెడ్డ ఆడవారితో ముఖ్యంగా స్నేహం చేయడం, వాడులాడటం, హాస్యపు మాటలతో మితిమీరి నవ్వటం మొదలైనవి నాకు ఇష్టం కలిగించవు. అట్టి పనుల జోలికి ఎప్పుడూ నేను పోను.
భర్తలు వారి కోరిక మేరకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పువ్వులు పెట్టుకోను. పరిమళపు పూతలు పూసుకోను. ధగధగలాడే ఆభరణాలు నేను ధరించను. భర్తలపైనే మనసు లగ్నం చేసుకుని వారు ఎప్పుడు ఇంటికి తిరిగిచేరుతారా అని వారి రాకకై ఎదురుచూస్తాను.
అత్తగారిపట్ల పూజ్య భావం కలిగి ఆమె చెప్పిన రీతిగా నా దినచర్యను దిద్దుకుంటాను. పెద్దలు, బ్రాహ్మణులు, అతిథులు వచ్చినప్పుడు వారికి సేవలు చేయటానికి సేవకులను వినియోగించను. నేనే స్వయంగా వారికి సేవ చేస్తాను. సంప్రీతి, క్షమ, వినయం, మంచితనం అనే శుభగుణాలు ఎల్లప్పుడూ విడవక సదా ప్రవర్తిస్తాను.
నాభర్తలైన పాండవులు ఎంత మెత్తనివారో అంత కఠినులు. వారి మనసు మెత్తని వారని తెలిసినా ఎప్పుడూ వారిపట్ల భయం లేకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించను.
ఓసత్యభామా! భర్తను మించిన ధైవం భార్యకు మరోకటి లేదు. భర్త దయచూపితే భార్యకు ఆభరణాలు లభిస్తాయి. ధన, ధాన్య సంపదలు కలుగుతాయి. మంచి సంతానం కలుగుతుంది. కీర్తి లభిస్తుంది. ఎంతో శ్రమిస్తే కాని కొంచెం సుఖం కలుగదు. పుణ్యం లభించటానికి ఎంతో శ్రమపడవలసి వస్తుంది. భర్తకు సేవ చేస్తే సులువుగా పుణ్యం లభిస్తుంది. శీఘ్రముగా ఎల్లప్పుడూ మేలు కలుగుతుంది. దాని వలన ధర్మం ప్రాప్తిస్తుంది
ఓ సత్యభామ! నీవు నీ భర్త యెడల ప్రతిదినము సరైన ఆలోచన, ఉపాయం, ప్రేమ, ఆరాధనా భావం సంప్రీతి ప్రసరింపజేయుము. అప్పుడు నీభర్త నీతో అనురాగంతో ప్రవర్తిస్తాడు.
భర్త ఎదైనా రహస్యం చెప్పితే అది ఎవ్వరికీ చెప్పకు.
భర్తకు ఇష్టమైన చుట్టాలకు, మిత్రులకు ఆహారపానీయాలు మొదలైన సదుపాయాలు సమకూర్చడంలో మిక్కిలి శ్రధ్ధ జాగ్రత్త వహించు. వారిని పూజ్యభావంతో గౌరవించు.
భర్త మేలుకోరక భర్తకు వ్యతిరేకమైన చర్యలు చేసేవారు నీకు మిత్రులైనప్పటికీ వారిని ఆదరించకు
No comments:
Post a Comment