త్వష్ట బ్రహ్మ సూక్తము.
1. దేవస్త్వష్టా సవితా విశ్వరూప: పుపోష ప్రజా: పురుధా జజాన ఇమాచ విశ్వాభువనాన్యస్య మహద్దేవానా మసురత్వమేకమ్ ||
సవితయు, విశ్వరూపుడు, భగవంతుడు నగు త్వష్ట బ్రహ్మ జీవులను అనేక విధములుగా సృష్టించి పోషించు చున్నాడు. ఈ సమస్త లోకములు ఆయన మహదైశ్వర్యమే.
2. య ఇమే ద్యావా పృథివీ జనిత్రీ రూపైరపింశ ద్భువనాని విశ్వా తమధ్య హోత రిషితో యజీయాన్ దేనమ్ త్వష్టార మిహ యక్షి విద్వాన్ ||
ఓ విద్వాంసులారా ! ఏ త్వష్ట దేవుడు ద్యావా పృథువులను సృజించి సమస్త భువనములను నానా రూపములు గలవానిగా చేసెనో అట్టి త్వష్ట బ్రహ్మను ఈ యజ్ఞకార్యము నందు హవిస్సులతో యజింపుడు.
3. ఋతావానం త్వష్టృ దేవం సావిత్రీ పతిమ్ స్వస్తయే | ఋతస్య జ్యోతిషస్పతిమ్ అజస్రం ఘర్మ ఈమహే ||
సత్య స్వరూపుడు, యజ్ఞాత్మకమైన తేజస్సునకు పతి, సావిత్రీ పతి, ఎల్లపుడు ప్రకాశించువాడు అయిన త్వష్ట దేవుని మేము ఉపాసించు చున్నాము.
4. మహి త్వాష్త్రమూర్జయంతీరజుర్య స్యభూయమానం వహతో వహన్తి | వ్యఙ్గేభిర్దిద్యు తాన: సధస్థ ఏకామివ రోదసీ ఆవివేశ ||
శక్తినొసంగునట్టి ప్రవహించే నదులు అగ్నిని భరించుతున్నాయి. అజరుడు అమరుడు మహాత్ముడు త్వష్ట దేవుని పుత్రుడైన అగ్ని జగత్తును ధారణ చేయుచున్నాడు. ఒక యువకుడు తన పత్నిని సమీపించి ఉత్తేజితుడైనట్లు అగ్ని జలమును సమీపించి ప్రజ్వలించి తన తేజమును ఏకముగా భూమ్యాకాశములందు అంతటా వ్యాపింప జేస్తున్నాడు.
5. తన్నస్తురీప మధ పోషయిత్ను దేవ త్వష్టర్వి రరాణ:స్య స్వ | యతో వీర: కర్మణ్య: సుదక్షో యుక్త గ్రావా జాయతే దేవకామ:||
ఓ త్వష్ట భగవానుడా! నీవు బ్రహ్మతేజో మయుడవు ! మమ్ము పోషించు వాడవు. నీ యొక్క ఏ దివ్యతేజోశక్తిచే వీరుడు, పరాక్రమ శాలియు, సామర్ధ్యము గలవాడును, దేవతలకు ప్రియతముడును అగు పుత్రుడు జన్మించునో అట్టి దివ్యతేజమును శక్తిని (బలమును) మాకు ప్రసాదించుము.
6. యోన: స్త్వష్టా సుశంశినో దుశంస ఆదిదేశతి వజ్రేణాస్య ముఖే జహి స సంపిష్టొ అపాయతి ||
ఓ త్వష్ట దేవా! ఏ దుష్ట బుద్ధిగల శత్రువు శోభనాశంసియై మమ్ములను నిష్ఠుర భాషణములతో ధిక్కరించునో ఆ శత్రువు ముఖం పై వజ్రాయుధంతో తాడనం చేయుము. వజ్ర ఘాతముతో వాడు చూర్ణీ భూతుడై అపగమించు గాక !
7.త్వష్టా యునక్తు బహుధా ను రూపా అస్మిన్ యజ్ఞే సుయుజ: స్వాహా ||
యోగ్యతముడైన త్వష్ట ఈ యజ్ఞం లో బహు రూపములను బహు ప్రకారములుగా ప్రయోగించుగాక ! ఈ యజ్ఞమునకు ఇది నా సమర్పణ !
8. త్వష్టామే దైవ్యం వచ: పర్జన్యో బ్రహ్మణస్పతి: పుత్రై ర్భ్రాతృభి రదితిర్ను పాతు నో దుష్టరం త్రాయమాణం సహ ||
త్వష్ట దేవుడు నా దివ్యమైన స్తుతి లక్షణ వాక్యములను ఆలకించుగాక ! పర్జన్యుడు బ్రహ్మణస్పతి నా స్తుతి వచనములను విందురు గాక ! అదితి తన పుత్రులతో, సోదరులతో గూడి అన్యులు అతిక్రమించలేని బలముతో వచ్చి దుష్టులనుండి నన్ను రక్షించు గాక !
9. పాతం న ఇంద్రా పూషణాదితి: పాంతు మరుత: అపాం నపాత్ సింధవ : సప్త పాతన పాతునో విష్ణురుత ద్యౌ : ||
ఇంద్ర పూషణులారా మమ్ము కాపాడెదరు గాక ! అదితియు, మరుత్తులు సప్త సముద్రములు మఱియు విద్యుదగ్నియు మమ్ము రక్షించెదరు గాక ! విష్ణువు మఱియు ద్యు లోకము మమ్ము రక్షించుగాక
10. పాతునో ద్యావా పృథివీ అభిష్టయే పాతు గ్రావా పాతు సోమో నో అంహస: పాతునో దేవీ సుభగా సరస్వతీ పాత్వగ్ని: శివా యే అస్య పాయవ: ||
ద్యావా పృథ్వులు మమ్ములను రక్షింతురు గాక ! అభిమత ధన ప్రాప్తికై అభిషవన శిల మమ్ము రక్షించు గాక ! సుభగురాలైన సరస్వతీ దేవి మమ్ములను రక్షించు గాక ! అగ్ని రక్షించు గాక ! ఈ అగ్నికి చెందిన శుభకరములైన కిరణములు మమ్ము రక్షించు గాక !
11. పాతాం నో దేవాశ్వినా శుభస్పతీ ఉషాసా నక్తోత న ఉరుష్పతామ్ అపాం నపా దభిహృతీ దేవ త్వష్టర్వర్ధయ సర్వతాతయే ||
ఓ దేవతలారా ! అశ్వినులు, ఉషా మరియు రాత్రి దేవియు మమ్ములను రక్షింతురుగాక ! మేఘ స్థానం లోని నీటిని పడవేసే అగ్ని రాక్షసాదులను నశింపజేసి మమ్ము రక్షించుగాక ! ఓ త్వష్ట దేవా ! సమస్త ఫలములను లభింపజేసి మమ్ములను వృద్ధిపరచుము!
No comments:
Post a Comment