మయ సూక్తమ్ maya suktam
దివే దివే మయం యజామహే వయం అథా భగవంత: స్యామ || .1
మయ బ్రహ్మను దినదినము పూజించుచు మేము ఐశ్వర్యవంతులము అయ్యెదము గాక !
మయో శర్ధ మహతే సౌభగాయ తవద్యుమ్నాన్యుత్తమాని ధేహి || .2
ఓ మయబ్రహ్మా ! నీ మహిమాన్విత శక్తి మాయెడల సౌభాగ్య కరమగు గాక ! నీ ఉత్తమమైన ధనమును, తేజో సంపదలను మాకు ప్రసాదించుము !!
దేవ స్తవ వ్రతే న రిష్యేమ కదాచన స్తోతార స్త ఇహ స్మసి || .3
ఓ మయ దేవా! నీ యజ్ఞ కర్మ యందు శత్రువులచే మేమెన్నడూ హాని పొందకుందుము గాక ! నిన్ను స్తుతులచే కీర్తించు వారలమై యుందుము గాక!
మయోభూర్వాతో అభివాతూస్రా ఊర్జస్వతీ రోషధీరా రిశంతామ |
పీవస్వతీ ర్జీవధన్యా: పిబంత్వ వసాయ పద్వతే రుద్ర మృళ || .4
ఓ రుద్రరూపా ! సుఖకరమైన వాయువును మా గోవుల వైపు ప్రవహింప జేయుము! అవి బలమైన పచ్చికను,రసోపేతమగు ఓషధులను భుజించి శుద్ధ జలములు గ్రోలి సుఖముగా జీవించుగాక !
ప్రజాపతిర్మహ్యమేతా రరాణో విశ్వైర్దేవే : పితృభి: సంవిదాన: |
శివా: సతీరూప నో గోష్టమాకస్తాసాం వయం ప్రజయా సం మదేమ || .5
విశ్వే దేవతలను, పితరులను సంప్రదించి మయ ప్రజాపతి మాకు గోసంపద నొసంగి యున్నాడు. కళ్యాణ కారిణులగు ఈ గోవులను మా గోష్టములయందు నిలిపి యున్నాడు.అవి సంతానవతులై బాగుగా దుగ్ధముల నొసగుచు మమ్ము ఆనందింప జేయు గాక!
మయా గావో గో పతినా సచధ్వ మయం వో గోష్ఠ ఇహ పోషయిష్ణు : |
రాయస్పోషేణ బహులా భవన్తీ ర్జీవా జీవన్తీరుప వ: సదేమ || .6
గోవులారా ! గోపతితో మీరు కలిసి నివసించండి.ఇక్కడ ఈ గోష్ఠం మీకు పోషకమగు గాక! ధన సమృద్ధితో అసంఖ్యాకములై చిరంజీవులైన మీరు మాకు లభింతురు గాక !
యదస్మృతి చకృమ కిం చిద్దేవ ఉపారిమ చరణే బ్రహ్మన్ మయ: |
తత: పాహిత్వం న: ప్రచేత: శుభే సఖిభ్యో అమృతత్వమస్తు న: || .7
ఓ దేవా! మేము యేదైన స్మరణ రహితమైన కర్మను చేసి యున్నచో, ఓ మయ బ్రహ్మా! మా అనుష్ఠానం లో కర్మ లోపించిననచో ప్రకృష్ట జ్ఞానవంతుడవైన నీవు అవిస్మరణ నిబద్ధమైన పాపము నుండి రక్షించుము. నీ స్నేహ ప్రియులమగు మాకు నీ అనుగ్రహము వలన ఈ శుభకరమైన కర్మ అమృతమయ మగుగాక !
No comments:
Post a Comment