విశ్వజ్ఞ సూక్తం (సౌర సూక్తం)
ఉదు త్యమ్ జాతవేదసం దేవం వహన్తి కేతవ: | దృశే విశ్వాయ సూర్యమ్ || .1
సమస్త జీవుల నెరిగిన సూర్యుని ప్రకాశ వంతమైన కిరణములు జనులందరు చూచు చుండగా ఆకాశమున వ్యాపించుచున్నవి.
అప త్యే తాయవో యథా నక్షత్రా యన్త్య క్తుభి: | సూరాయ విశ్వచక్షసే || .2
సర్వదర్శి యైన సూర్యుడు ఉదయించి నంతనే నక్షత్రాదులు దొంగలవలె దాగికొని అదృశ్యమైనవి.
అదృశ్రమస్య కేతవో వి రశ్మయో జనాం అను | భ్రాజన్తో అఘ్నయో యథా || .3
ప్రజ్వలించు అగ్ని శిఖలు వెలుగు జండాల వలె కన్పట్టుచుండ భువియందలి జనులను జూడ వచ్చెనా యన్నట్లు సూర్యుడు గోచరించు చున్నాడు.
తరణి ర్విశ్వ దర్శతో జ్యొతిష్కృదసి సూర్య | విశ్వమా భాసి రోచనమ్ || .4
ఓ సూర్యుడా ! నీవు వేగవంతుడవు. అందరికీ దర్శనీయుడవు. నీ వెలుగే విశ్వమంతటినీ ప్రకాశింప జేయుచున్నది.
ప్రత్యఙ్ దేవానామ్ విశ: ప్రత్యఙ్ ఉదేషి మానుషాన్ | ప్రత్యఙ్ విశ్వం స్వ ర్దృశే || .5
ఓ సూర్యుడా ! నీవు దేవగణములకు, మనుష్యులకు మరియు సమస్త ప్రాణుల కొరకు వెలుగును పంచుతూ ఆకాశమునందు సంచరించు చున్నావు.
యేనా పావక చక్షసా భురణ్యంతమ్ జనాం అను | త్వం వరుణ పశ్యసి || .6
ఓ పవిత్రకారకుడగు వరుణ దేవా! నీవు యే దివ్య నేత్రముతో జనులను తిలకింతువో అట్టి నీ దివ్య నేత్రమునకు ప్రణామములు.
వి ద్యామేషి రజస్పృథ్వహా మిమానో అక్తుభి: | పశ్యఞ్ జన్మాని సూర్య || .7
సూర్యుడా! నీవు రాత్రుల నుండి పగటి సమయములను వేరు పరచుచు జీవులకు కనిపించు విధముగా విశాలమైన గగనమునందు విహరించు చున్నావు.
సప్త త్వా హరితో రథే వహన్తి దేవ సూర్య | శోచిష్కేశం విచక్షణ || .8
ఓ సూర్యా ! తేజోరశ్మి కేశుడవైన నీవు రథారూఢుడవు కాగా నీ రథమును సప్తాశ్వములు భరించుచున్నవి
అయుక్త సప్త శున్ధ్యువ: సూరో రథస్య నప్త్య: | తాభిర్యాతి స్వయుక్తిభి: || .9
సూర్యుడు శుద్ధ తేజస్వినులగు సప్తాశ్వములు పూన్చిన రథమున గగనమునందు పయనించు చున్నాడు.
ఉద్ వయం తమసస్పరి జ్యోతిష్ పశ్యన్త ఉత్తరమ్ | దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమమ్ || .10
అంధకారమునకు ఉపరిభాగమున విస్తృత ప్రకాశమును వ్యాపింప జేయుచున్న, దేవతలలో శ్రేష్ఠుడైన సూర్యుని సమీపమునందుండి దర్శించెదము గాక !
ఉద్యన్నద్య మిత్ర మహ ఆరోహన్నుత్తరాం దివమ్ | హృద్రోగం మమ సూర్య హరిమాణంచ వాశయ || .11
మిత్రులకు మిత్రుడై అకాశమున నేడు ఉదయించి అత్యున్నత స్థానమును అధిరోహించెడు సూర్యుడు నా హృదయ రోగమును నిర్మూలించి శరీరము నందలి పసుపు పచ్చ రంగును తొలగించుగాక !
శుకేషు మే హరిమాణం రోపణాకాసు దధ్మసి | అథో హారిద్రవేషు మే హరిమాణం ని దధ్మసి || .12
ఓ సూర్యుడా ! నా శరీరపు పసుపు రంగును నేను శుక శారికలలో స్థాపించుదును గాక ! నీ పూర్ణ తేజస్సు నా సర్వ రోగములు నశించుటకు కారణమగు గాక !
ఉదగా దయ మాదిత్యో విశ్వేన సహసా సహ | ద్విషన్తం మహ్యం రన్ధయన్ మో అహం ద్విషతే రథమ్ || .13సర్వమును జయించగల శౌర్య వీర్య శక్తులతో కూడి యుండి గగనమున అత్యున్నత స్థితికి జేరుకొనెడి సూర్యుడు శత్రువులను నా వశ మొనరించు గాక. నన్ను శత్రువుల బారి పడకుండ జూచు గాక !
No comments:
Post a Comment