ప్ర:) సప్త మాతృకలకు 16సంవత్సరాలలోపు ఉన్న పిల్లలను భాదించే వరం కుమారస్వామి ఇచ్చాడంటారు నిజమేనా? మాతృకలకు స్కందపస్మారుడు రక్షకుడు ఎలా అయ్యాడు ?
జ.) మీరనుకుంటున్న సప్త మాతృకలు వేరు. వారు (బ్రాహ్మీ, మహెశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహీ, ఇంద్రాణి, చాముండ) పిల్లలను భాదించేవారు వీరు కాదు.పిల్లలను బాధించే మాతృకలను కుమార మాతృకలు స్కందమాతృకలు అంటారు వారు హవిష, కాళి, కౌశిక, ఉద్దత, శారిక, ఆర్య, వైదాత్రి
ఈస్కందమాతృకలు ఒక సమయంలో కుమారస్వామి దగ్గరకు వచ్చి ఓకుమారస్వామీ! సప్తమాతృకలమైన మమ్ము మూడులోకాలకూ మాతృకలుగా నియమించుము. సర్వలోకాలలోనూ మునుపటి మాతృకలయిన ( బ్రాహ్మీ, మహెశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహీ, ఇంద్రాణి, చాముండ) వీరిని దేవతలుగా పరిగణించకుండా మమ్మల్ని మాత్రమే త్రిజగన్మాతలుగా (త్రిజగన్మాతలు = మూడు లోకాలలోని మాతృకలు) పరిగణించే విధంగా మాకు వరం ప్రసాదించు అని వేడుకున్నారు. అప్పుడు కుమారస్వామి వారితో మునుపటి మాతృకల ఆధిక్యం మాన్పటానికి మీరెందుకు కోరుకుంటున్నారు. మీకు మేలు చేకూరే విధంగా ఇంకొక వరం కోరుకోండి అని చెప్పగా స్కందమాతలు ఇలా అన్నారు.
"మేము కోరుకుంటున్న వరం మాత్రమే మాకు అనుగ్రహించు. మేము ఈలోకాలలోని పసిబిడ్డలకు ఎల్లప్పుడూ బాధలను కలిగిస్తాం. నీ దయవల్ల వర్దిల్లుతాం. ఈవరాన్ని నీవు మాకు ఇవ్వాలి"
ఈమాటలు విన్న కుమారస్వామి "అయ్యో మీరు పసిబిడ్డలకు హానిచేయటానికి తలపోసారు. ఇది న్యాయమైన ఆలోచన కాదు కదా. మీరు ఈకోరిక మాత్రమే కోరారు కాబట్టి అనుగ్రహిస్తున్నాను. కాని మిమ్మల్ని ఆరాధిస్తే, ప్రార్థిస్తే ,మీకు నమస్కరిస్తే మాత్రం మీరు పసిబిడ్డలకు కీడు చేయకుండా ఉండండి, వారిపై దయచూపండి అని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను.
ఓ సప్తమాతృకలారా పదహరేళ్ళ వయస్సు నిండేవరకు మీరు పసిపిల్లలను ఆహహించి బాధించండి. నాగొప్ప అంశతో జన్మించినట్టి ఒక మహాపురుషుడిని మీకు రక్షకుడిగా నియమిస్తున్నాను"
ఈవిధంగా కుమారస్వామి పలికి తన శరీరం నుండి బంగారు ఛాయ గల ఒక మహాపురుషుడిని సృష్టించాడు. ఆ బంగారు ఛాయ గల మహాపురుషుడు పుట్టిన వెంటనే ఆకలి బాధ చేత తల తిరిగి నేలపై పడిపోయాడు. ఆవిధంగా పడిపోయిన వాడికి కుమారస్వామి చైతన్యం కలిగించాడు. అతడు స్కందాపస్మారుడు అనే పిశాచంగా రూపొంది మాతృకలను కాపాడే అంగరక్షకుడు అయ్యాడు.
వీరే కాక శకుని తల్లి వినత, రాక్షసుల తల్లి దితి, ఆవుల తల్లి సురభి, కుక్కల తల్లి సరమ, చెట్లతల్లి కరంజ, పాముల తల్లి కద్రువ, కుమారస్వామి దాది లోహితాస్య, మాతృకలతో కలిసి గర్భాలకు పీడనూ శిశువులకు బాధను కలిగిస్తారు. వారిని శాంతింపజేయటానికి మనుషులు జపాలు, బలులు, కానుకలు, ముడుపులు, తర్పణాలు, నమస్కారాలు, ప్రార్థనలు చేస్తారు. ఈ ప్రక్రియలతో వారు శాంతించి ఆయువు ఆరోగ్యం శాంతి కలిగిస్తారు.
No comments:
Post a Comment