ధర్మ సందేహాలు 5
1). భార్యాభర్తలు ఒకరికొకరు పేర్లు పెట్టి పిలుచుకోవచ్చా
జ). భార్యా భర్తలు ఒకరికొకరు పేర్లు పెట్టి పిలుచుకోవడం కలిసి భోజనం చేయడం ధర్మ విరుద్ధం. దీనికి ధర్మశాస్త్రం ఒప్పుకోదు. మరియు ఇది ఆయుఃక్షీణం కూడా మన కంటే పెద్దవారిని పేరు పెట్టి పిలవకూడదు.
భార్య కంటే భర్త పెద్దవాడు కాబట్టి భార్య భర్తను పేరు పెట్టి పిలవకూడదు. మరియు ఈ పద్దతి పతివ్రతా నియమాలకు కూడా విరుద్ధం. పూర్వ కాలంలో భార్యలు భర్తలను "స్వామి, నాథా" అని పిలిచేవారు. ఇప్పుడైతే అలా పిలవకపోయినా "ఏవండీ" అని పిలిస్తే చాలు ఇంక భర్తలు భార్యలను పేరు పెట్టి పిలువ వచ్చు లేదా పూర్వం "వశి , ఏమేవ్" అని పిలిచేవారు. పేరు పెట్టి పిలవడం వల్ల అంత అనుబంధం ఉండదు కాబట్టి. "వశి" అంటే శివా అని కూడా అర్థం
శాస్త్ర ఆధారం (సమస్త వైదిక గ్రంథాలలోని సదాచార నిరూపణం)
2). తులసిమాలతో ఏదైవ జపమైనా చేయవచ్చా?.
జ). ఒక్కొక్క దైవానికి ఒక్కొక్క జపమాల చెప్పబడింది. ఒక్కొక్క కోరికకు ఒక్కొక్క జపమాల చెప్పబడింది. ఉదాహరణకు సంపద కోరుకునేవారు తామరగింజల మాల పద్మాక్షమాల వాడతారు. మోక్షం కోరుకునేవారు స్పటికమాల జ్ఞానం కోరుకునేవారు రుద్రాక్షమాల వాడతారు. తులసిమాలను సౌమ్యమైన సాత్వికమైన సాధనలకు విష్ణు పరివార సంబంధమైన దేవతలకు (రాముడు, కృష్ణుడు వంటి విష్ణు సంబంధమైన దేవతలు) వాడవచ్చు.
3). ఆదివారం నాడు ఉసిరి ఎందుకు తినకూడదు ?.
జ). "సర్వయజ్ఞేషు కార్యేషు శస్తం చామలకేఫలం
సర్వదేవస్య పూజాయాం వర్జయిత్వా రవిసుతం
తత్మాద్రవిదినే తాత సప్తమ్యాం చ విశేషతః
ధాత్రీ ఫలాని సతతం దూరతః పరివర్జయేత్"
వివిధ రకాల యజ్ఞాయాగాలలో సకలదేవతల పూజలో ఉసిరిఫలాన్ని వినియోగిస్తారు. అయితే కేవలం సూర్యుడి పూజలో మాత్రమే ఉసిరిఫలాన్ని వినియోగించరు. అందుకే సూర్యవారమైన ఆదివారం, సప్తమి తిథి నాడు ఉసిరికాయని తాకకూడదు, స్వీకరించకూడదు.
ఉసిరిలోని పులుపుకి శుక్రుడు అధిపతి ఆదివారానికి సూర్యుడు అధిపతి సూర్యునికి శుక్రుడుకి శత్రుత్వం కాబట్టి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం నాడు ఉసిరి తినరు. ఆయుర్వేదంలో కూడా ఆదివారం నాడు ఉసిరి కోయడం ఉసిరితో చేయబడే ఔషదాలు కూడా తయారు చేయడం చేయరు.
4). కార్తీకమాసంలో తులసి దగ్గర దీపం ఎందుకు వెలిగిస్తారు ?.
జ). రావి,మారేడు,కదంబ,జమ్మి మొదలైన పవిత్ర వృక్షాలన్నింటిలోనూ తులసికి అగ్రస్థానం శాస్త్రం ప్రకారం దీపం ఒక్కొక్క చోట పెడితే ఒక్కొక్క ఫలితం ఉంటుంది. కార్తీకమాసానికి మరోపేరు దామోదరమాసం. దామోదరుడు అంటే నారాయణుడు ఇక తులసి లక్ష్మీ స్వరూపం. సరస్వతి దేవి శాప ఫలితంగా లక్ష్మి భూలోకంలో తులసిగా జన్మించింది. విశేషించి కార్తీకమాసంలో తులసి దగ్గర దీపం పెడితే లక్ష్మీనారాయణులను ఆరాధించిన ఫలితం అందుకే కార్తీకమాసంలో తులసి దగ్గర దీపారాధన చేయాలి. అలాగని దీపం మరీ దగ్గరగా పెడితే వేడికి తులసివృక్షం కాలి వాడిపోయే ప్రమాదం ఉంది దీనివల్ల పాపం వస్తుంది అందుకే వృక్షానికి హాని కలుగకుండా ఉండేలా దీపం పెట్టాలి. ఇంటి దగ్గర ఉండే తులసి దగ్గర వెలిగించే దీపానికి వంద శాతం ఫలితం ఉంటే దేవాలయంలో ఉండే తులసి దగ్గర వెలిగించే దీపానికి వెయ్యి శాతం ఫలితం
5). ఇంట్లో ఎవరైనా చనిపోతే సంవత్సరం పాటు దీపం వెలిగించకూడదా?
జ). ఇంట్లో ఎవరైన వ్యక్తి చనిపోతే పన్నెండు రోజులు పూర్తి అయిన తరువాత గృహశుద్ధి అయిన తరువాత నుండి ఇంట్లో దీపం వెలిగించవచ్చు. ఎటువంటి దోషం లేదు. సంవత్సరంపాటు దీపం వెలిగించకూడదు అని ఏశాస్త్రంలోనూ లేదు మధ్యలో కొంతమంది కల్పించారు.ఇంట్లో తల్లి చనిపోతే ఆరు నెలలు తండ్రి చనిపోతే సంవత్సరం ప్రత్యేక పూజలు, పండుగలు, వ్రతాలు మాత్రం చెయ్యకూడదు. చనిపోయిన వ్యక్తి ఇంట్లో దీపాలు వెలిగించడం వలన ముఖ్యంగా కార్తీకమాసంలో దీపాలు వెలిగించడం వలన చనిపోయిన వ్యక్తులకు నరకయాతన నుండి ఉపశమనం కలుగుతుంది
6). ఇంట్లో తులసి మొక్క ఎటువైపు ఉండాలి.
జ). నిదుర లేవగానే తులసి కనపడే విధంగా ఉండాలి. తులసి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. నిత్యం దీపారాధన చేసే తులసికోట ముఖ్యంగా తూర్పువైపు ఉంటే మంచిది. తులసి గడపకు ఎదురుగా ఉండం వల్ల దృష్టి దోషాలు పోతాయి. కానీ బయటి వ్యక్తులు ఎవరూ తులసిని తాకకుండా ఉండేటట్లు చూసుకోవాలి. తులసి ఎటువైపు ఉన్నా మంచిదే. కానీ ప్రధానంగా పూజలందుకునే తులసి గడపకు అభిముఖంగా ఉండేటట్లు వేసుకుంటారు. ఇంటి దొడ్డిలో వేసుకుంటే దొడ్డి తలుపు తీయగానే కనిపించే విధంగా వేసుకోవచ్చు ఉత్తరముఖంగా గడప ఉండేవారు ముందున్న కాలీ ప్రదేశంలోనూ మొక్కను ఉంచుకోవచ్చు.
7). తులసి ఎన్ని రకాలు ఇంట్లో ఏ తులసిని పూజించాలి
జ). శాస్త్రం ప్రకారం తులసి 11 వేల రకాలు కాని భూమిపై 96 రకాలు మాత్రమే లభ్యం అవుతున్నాయి. ఇందులో గంగా తీరంలో, యమునా తీరంలో, సరస్వతీ తీరంలో లభించే తులసి చాలా ఉత్తమం.
గంగా తీరంలో లభించే తులసిని లక్ష్మీ తులసి అని యమునా తీరంలో లభించే తులసిని కృష్ణ తులసి అని అంటారు సరస్వతీ తీరం మరియు ఇతర పుణ్య క్షేత్రాలలో లభించే తులసిని శ్వేత తులసి అంటారు. బదరికాశ్రమంలో ఉండే తులసిని వైరాగ్యప్రద తులసి అంటారు. ద్వారకలో ఉండే తులసిని సంపత్ప్రధాన తులసి అంటారు ఇంకా ఇలా ఎన్నో రకాల తులసి ఉన్నాయి ఎటువంటి తులసినైనా మనం పూజించవచ్చు ఫలానా తులసిని మాత్రమే పూజించాలి అని నియమం ఏమీలేదు అయితే తులసిలన్నిటిలోకి కృష్ణ తులసి ఉత్తమం
8). హనుమంతుని వాహనం ఏమిటి
జ). సేకరణ (పరాశర సంహిత)
హనూమంతుని వాహనం ఒంటె. హనుమంతుడు సువర్చలా సహితుడై ఒంటె మీద కూర్చుని భక్తులకు దర్శనం ఇచ్చినట్లు అనేక గాథలు కూడా ఉన్నాయి. హనుమంతుడు పంపానది తీరంలో ఇసుకతిన్నెలలో ఒంటె మీద విహరిస్తాడు. ఇసుకలో నడిచే శక్తి కూడా ఒంటెకి ఎక్కువ ఉంటుంది. హనుమంతుని ధ్వజం(జెండా) కూడా ఒంటె
No comments:
Post a Comment