దక్షిణామూర్తి వర్ణమాలా స్తోత్రం
ఈ స్తోత్రము నందలి ప్రతి శ్లోకంలోని అక్షరములు వరుసగా చేర్చినచో "ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రయచ్చ స్వాహా" అను దక్షిణామూర్తి మహామంత్రమగును.
స్తోత్రం
ఓమిత్యేతద్యస్య బుధైర్నామగృహీతం
యద్భాసేదం భాతి సమస్తం వియదాది
యస్యాజ్ఞాతః స్వస్వపదస్థా విధిముఖ్యా
తం ప్రత్ర్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి (1)
నమ్రాంగాణాం భక్తిమతాం యః పురుషార్థాన్
దత్వా క్షిప్రం హన్తి చ తత్సర్వవిపత్తీః
పాదాంభోజాధస్తనితాపస్మృతిమీశం
తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి (2)
మోహధ్వస్త్యై వైణికవైయాసికిముఖ్యాః
సంవిన్ముద్రాపుస్తకవీణాక్షగుణాన్యమ్
హస్తాంభోజైర్బిభ్రతమరాదితవన్తః
తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి (3)
భద్రారూఢం భద్రదమారాధయితౄణాం
భక్తిశ్రద్ధాపూర్వకమీశం ప్రణమన్తి
ఆదిత్యా యం వాంఛితసిద్ద్యై కరుణాబ్ధిం
తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి (4)
గర్భాన్తస్థాః ప్రాణిన ఏతే భవపాశ
చ్చేదే దక్షం నిశ్చితవన్తః శరణమ్ యమ్
ఆరాధ్యాంఘ్రిప్రస్ఫురదంభోరుహయుగ్మం
తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి (5)
వక్త్రం ధన్యాః సంసృతివార్ధేరతిమాత్రాత్
భీతాః సన్తః పూర్ణశశాంకద్యుతి యస్య
సేవన్తేధ్యాసీనమనన్తం వటమూలం
తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి (6)
తేజఃస్తోమైరంగద సంఘట్టిత భాస్వన్
మాణిక్యోత్థైర్భాసితవిశ్వోరుచిరైర్యః
తేజోమూర్తిం ఖానిలతేజః ప్రముఖాబ్ధిం
తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి (7)
దధ్యాజ్యాదిద్రవ్యకకర్మాణ్యఖిలాని
త్యక్త్వా కాంక్షాం కర్మఫలేష్వత్ర కరోతి
యజ్ఞిజ్ఞాసాం రూపఫలార్థీ క్షితిదేవః
తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి (8)
క్షిప్రం లోకే యం భజమానః పృథుపుణ్యః
ప్రధ్వస్తాధిః ప్రోఝ్జితసంసృసత్యఖిలార్తిః
ప్రత్యగ్భూతం బ్రహ్మ పరం సన్రమతే చ
తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి (9)
ణానేత్వేవం యన్మనుమధ్యస్థితవర్ణాన్
భక్తాః కాలే వర్ణగృహీత్యైప్రజపన్తః
మోదన్తే సంప్రాప్తసమస్తశ్రుతితన్త్రాః
తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి (10)
మూర్తిశ్చాయానిర్జితమందాకినికుంద
ప్రాలేయాంభోరాశిసుధాభూతి సురేభా
యస్యాభ్రాభాహసవిధౌ దక్షశిరోధిః
తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి (11)
తప్తస్వర్ణచ్చాయజటాజూటకటాహ
ప్రోద్యద్వీచీవల్లివిరాజత్సురసింధుమ్
నిత్యం సూక్ష్మం నిత్యనిరస్తాఖిలదోషం
తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి (12)
యేన జ్ఞాతేనైవ సమస్తం విదితం స్యాత్
యస్మాదన్యద్వస్తు జగత్యాం శశశృంజ్గమ్
యం ప్రాప్తానాం నాస్తి పరం ప్రాప్యమనాదిం
తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి (13)
మత్తో మారో యస్య లలాటాక్షిభవాగ్ని
స్ఫూర్జత్కీలప్రోషితభస్మీకృతదేహః
తద్భస్మాసీద్యస్య సుజాతః పటవాసః
తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి (14)
హ్యంభోరాశౌ సంసృతిరూపే లుఠతాం తత్
పారం గన్తుం యత్పదభక్తిర్డృఢనౌకా
సర్వారాధ్యం సర్వగమనాన్దపయోధిం
తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి (15)
మేధావీ స్యాదిన్దువతంసం ధృతవీణం
కర్పూరాభం పుస్తకహస్తం కమలాక్షమ్
చిత్తే ధ్యాయన్యస్య వపుర్ద్రాన్ నిమిషార్థం
తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి (16)
ధామ్నాం ధామ ప్రౌఢరుచీనాం పరమం యత్
సూర్యాదీనాం యస్య స హేతుర్జగదాదేః
ఏతావాన్యో యస్య న సర్వేశ్వరమీడ్యం
తః ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి (17)
ప్రత్యాహరప్రాణనిరోధాదిసమర్థైః
భక్తైర్థాన్తైః సంయతచిత్తైర్యతమానైః
స్వాత్మత్వేన జ్ఞాయత ఏవ త్వరయా యః
తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి (18)
జ్ఞాంశీభూతాన్ర్పాణిన ఏతాన్ఫలదాత
చిత్తాన్తఃస్థః ప్రేరయతి స్వే సకలేపి
కృత్యే దేవః ప్రాక్తనకర్మానుసరః సం
తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి (19)
ప్రజ్ఞామాత్రం ప్రాపితసంవిన్నిజభక్తం
ప్రాణాక్షాదేః ప్రేరయితారం ప్రణవార్థమ్
ప్రాహుః ప్రాజ్ఞా యం విదితానుశ్రవతత్త్వాః
తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి (20)
యస్యాజ్ఞానాదేవ నృణాం సంసృతిబన్దో
యస్య జ్ఞానాదేవ విమోక్షో భవతీతి
స్పష్టం బ్రూతే వేదశిరో దేశికమాద్యం
తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి (21)
ఛన్నేవిద్యారూపపటేనైవ చ విశ్వం
యత్రాధ్యస్తం జీవపరేశత్వమపీదమ్
భానోర్బానుష్వంబువదస్తాఖిలభేదం
తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి (22)
స్వాపస్వప్నౌ జాగ్రదవస్థాపి న యత్ర
ప్రాణశ్చేతః సర్వగతోయః సకలాత్మా
కూటస్థో యః కేవలసచ్చిత్సుఖరూప
తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి (23)
హాహేత్యేవం విస్మయమీయుర్మునిముఖ్యా
జ్ఞాతే యస్మిన్ స్వాత్మతయానాత్మవిమోహః
ప్రత్యగ్భూతే బ్రహ్మణి యాతః కథమిత్థం
తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి (24)
యైషా రమ్యైర్మత్తమయూరాభిధవృత్తైః
ఆదౌ క్లుప్తా యన్మనువర్ణైర్మునిభంగీ
తామేవైతాం దక్షిణవక్త్రః కృపయాసౌ
పూరీకుర్యాద్దేశికసమ్రాట్ పరమాత్మా (25)
స్తోత్ర వివరణ
1. ఓంకార నామముచే పండితులచే పిలువబడువాడు, తన కాంతిచే ఆకాశము మొదలైన సమస్త ప్రపంచమును ప్రకాశింపచేయువాడు తన ఆజ్ఞచే బ్రహ్మ మొదలైన వారిని వారి వారి పదవులలో నిలుపుచున్నవాడు, ఈ ప్రపంచము కంటే వేరుగా ప్రకాశించుచున్నవాడగు దక్షిణామూర్తిని సేవించుచున్నాను.
2.భక్తులకు ధర్మార్ధకామమోక్షములనొసగి వారి ఆపదలన్నిటినీ వెనువెంటనే పోగొట్టువాడు, భక్తుల ఆజ్ఞానమును పారద్రోలువాడు, ఈ ప్రపంచముకంటే వేరుగా ప్రకాశించుచున్నవాడగు దక్షిణామూర్తిని సేవించుచున్నాను.
3. నారదుడు- శుకుడు మొదలైన మహర్షులు తమ ఆజ్ఞానమును పోగొట్టుకొనుటకై జ్ఞాన ముద్ర-పుస్తకము-వీణ-జపమాలలను నాలుగు చేతులలో ధరించిన ఏస్వామిని ఆరాధించినారో అట్టి దేవుడు ఈప్రపంచము కంటే వేరుగా ప్రకాశించుచున్నవాడగు దక్షిణామూర్తిని సేవించుచున్నాను
4. వృషభవాహనుడు తననారాధించువారికి మంగళములనొసగువాడు, తభ కోరికలు తీరుటకై దేవతలచేత కూడా భక్తిశ్రద్ధలతో నమస్కరింపబడు కరుణాసముద్రుడు, ఈ ప్రపంచము కంటే వేరుగా ప్రకాశించుచున్నవాడగు దక్షిణామూర్తిని సేవించుచున్నాను.
5. పరమాత్మ గర్భమునందున్న సమస్తప్రాణులు తమ సంసారబంధమును ఛేదించుటకు ఏస్వామిని సమర్థునిగా నిశ్చయించినారో అట్టిదేవుని పాదపద్మములను పూజించి, ఈప్రపంచము కంటే వేరుగా ప్రకాశించుచున్నవాడగు దక్షిణామూర్తిని సేవించుచున్నాను.
6. అంతులేని సంసారసముద్రమును దాటలేక భయపడువారు ఏస్వామి యొక్క పూర్ణచంద్రుని వంటి ముఖమును చూచి ధన్యులై మర్రిచెట్టుక్రింద కూర్చున్న ఆయనను సేవించుచున్నారో, అట్టి దేవుడు, ఈప్రపంచము కంటే వేరుగా ప్రకాశించుచున్నవాడగు దక్షిణామూర్తిని సేవించుచున్నాను.
7. తాను ధరించిన ఆభరణములలోని మాణిక్య కాంతులచే లోకములన్నింటినీ ప్రకాశింపచేయుచున్నవాడు, ఆకాశము - వాయువు - అగ్ని - జలము - భూమి మొదలైన వాటికి నిలయమైనవాడు, ఈప్రపంచము కంటే వేరుగా ప్రకాశించుచున్నవాడగు దక్షిణామూర్తిని సేవించుచున్నాను.
8. పండితుడు కర్మఫలమును విడచి ఏదేవుని తత్త్వమును తెలుసుకోవలెనను కోరికతో అభిషేకము - హెమము మొదలైన సత్కర్మలను చేయుచున్నాడో అట్టి దేవుడు, ఈ ప్రపంచము కంటే వేరుగా ప్రకాశించుచున్నవాడగు దక్షిణామూర్తిని సేవించుచున్నాను
9. ఏ స్వామిని పూజించిన మానవుడు మిక్కిలి పుణ్యవంతుడై ఈలోకమునందలి సమస్త దుఃఖములనుండి విముక్తుడై పరబ్రహ్మనందమును అనుభవించుచున్నాడో అట్టిదేవుడు, ఈప్రపంచము కంటే వేరుగా ప్రకాశించుచున్నవాడగు దక్షిణామూర్తిని సేవించుచున్నాను.
10. భక్తులు ఏదక్షిణామూర్తి మహామంత్రము మధ్యలో ఉన్న వర్ణములను 'ణా' అని 'న' అని సమయానుగుణంగా జపించుచూ సమస్త వేదరహస్యములను తెలుసుకుని ఆనందించుచున్నారో అట్టి దేవుడు, ఈ ప్రపంచము కంటే వేరుగా ప్రకాశించుచున్నవాడగు దక్షిణామూర్తిని సేవించుచున్నాను.
11. గంగ-మల్లె-మంచు-సముద్రములోని అమృతము-విభూతి-ఐరావతము వీటినన్నింటినీ మించిన తెల్లని శరీరము కలవాడు, తన నవ్వుచే దక్షప్రజాపతి ముఖమును నల్లని మబ్బువలె కాంతిహీనముగా చేయువాడు, ఈప్రపంచము కంటే వేరుగా ప్రకాశించుచున్నవాడగు దక్షిణామూర్తిని సేవించుచున్నాను.
12. బంగారువన్నె కల జటాజూటమందు ఎగసిపడుచున్న గంగను ధరించినవాడు, నిత్యమైనవాడు, సూక్ష్మస్వరూపుడు, సమస్త దోషములను తొలగించువాడు, ఈప్రపంచముకంటే వేరుగా ప్రకాశించుచున్నవాడగు దక్షిణామూర్తిని సేవించుచున్నాను.
13. ఏస్వామిని గురించి తెలుసుకున్నచో సమస్తము తెలియబడునో, ఎవనికంటే వేరైనది ఈప్రపంచమునందేదీ లేదో, ఎవనిని పొందినవారికి వేరే పొందవలసినదేదీ ఉండదో అనాదియైనవాడు, ఈప్రపంచము కంటే వేరుగా ప్రకాశించుచున్నవాడగు దక్షిణామూర్తిని సేవించుచున్నాను.
14. మదించిన మన్మథుని తన మూడవకంటి నుండి ఉద్భవించిన అగ్నిజ్వాలలచే దహించి, ఆబూడిదను శరీరముపై పూసుకున్నవాడు, ఈప్రపంచము కంటే వేరుగా ప్రకాశించుచున్నవాడగు దక్షిణామూర్తిని సేవించుచున్నాను.
15. సంసారసముద్రమునందు కొట్టుకుపోవుచున్న జనంలు దరిజేరుటకు దక్షిణామూర్తి పాదములపై భక్తియే ధృడమైన నౌక, అందరిచే ఆరాదింపబడువాడు, అంతట ఉన్నవాడు, ఆనందసముద్రుడు, ఈప్రపంచము కంటే వేరుగా ప్రకాశించుచున్నవాడగు దక్షిణామూర్తిని సేవించుచున్నాను.
16. తలపై చంద్రున్ని అలంకరించుకున్నవాడు, వీణను ధరించినవాడు, కర్పూరము వంటి వర్ణము కలవాడు, పుస్తకమును పట్టుకున్నవాడు, కమలము వంటి కన్నులుకలవాడు అగు ఏస్వామిని అర్థనిముషమైననూ ధ్యానించి మానవుడు మేథావియగునో, అట్టిదేవుడు, ఈప్రపంచము కంటే వేరుగా ప్రకాశించుచున్నవాడగు దక్షిణామూర్తిని సేవించుచున్నాను.
17. గొప్పకాంతిగల సూర్యుడు మొదలైనవారిని సైతం ప్రకాశింపచేయువాడు, ప్రపంచమును సృష్టించువాడు, సమస్త జగత్తును పాలించువాడు, ఈప్రపంచము కంటే వేరుగా ప్రకాశించుచున్నవాడగు దక్షిణామూర్తిని సేవించుచున్నాను.
18. ప్రత్యాహారము - ప్రాణాయామము మొదలైనవి చేయువారు, భక్తులు, ఇంద్రియములను జయించువారు, స్థిరచిత్తులు, యోగులు అగువారికి తమయందే కనబడుచున్నవాడు, ఈప్రపంచము కంటే వేరుగా ప్రకాశించుచున్నవాడగు దక్షిణామూర్తిని సేవించుచున్నాను.
19. పరమాత్మ యొక్క అంశలైన జీవుల మనస్సునందుండి, వారి పూర్వకర్మల ననుసరించి ఫలితములనిచ్చుచూ మోక్షము పొందు ప్రయత్నముకై ప్రేరేపించువాడు, ఈప్రపంచము కంటే వేరుగా ప్రకాశించుచున్నవాడగు దక్షిణామూర్తిని సేవించుచున్నాను.
20. వేదతత్త్వములనెరిగిన పండితులు, జ్ఞానస్వరూపుడు, తన భక్తులకు జ్ఞానమును ప్రసాదించువాడు, ప్రాణములను-ఇంద్రియములను ప్రేరేపించువాడు, ఓంకారమునకు అర్థమైనవాడు, అని ఏస్వామిని ప్రశంసించెదరో, అట్టి దేవుడు, ఈప్రపంచము కంటే వేరుగా ప్రకాశించుచున్నవాడగు దక్షిణామూర్తిని సేవించుచున్నాను.
21. దక్షిణామూర్తియే ఆదిగురువని, ఆయనను తెలుసుకొనకపోవుటవలననే మానవులకు సంసారబంధములు ఏర్పడుచున్నవని, ఆయనను తెలుసుకున్నంతనే మోక్షము కలుగునని వేదాంతము స్పష్టంగా చెప్పుచున్నది. ఈప్రపంచము కంటే వేరుగా ప్రకాశించుచున్నవాడగు దక్షిణామూర్తిని సేవించుచున్నాను.
22. ఎడారిలో సూర్యకిరణములే నీరుగా కనబడును. అట్లే దక్షిణామూర్తి అవిద్యారూపమైన వస్త్రముచే కప్పబడినప్పుడు ప్రపంచము-జీవుడు-పరమాత్మ అని భాసించును. ఏదోషములు లేనివాడు ఈప్రపంచము కంటే వేరుగా ప్రకాశించుచున్నవాడగు దక్షిణామూర్తిని సేవించుచున్నాను.
23. సర్వవ్యాపియగు పరమాత్మకు గాఢనిద్ర-స్వప్నావస్థ-జాగ్రదవస్థలు లేవు. ప్రాణము-చిత్తములు లేవు. సత్యము-జ్ఞానము-ఆనందములు తన స్వరూపముగా ఉన్న కూటస్థుడు, ఈప్రపంచము కంటే వేరుగా ప్రకాశించుచున్నవాడగు దక్షిణామూర్తిని సేవించుచున్నాను.
24. పరబ్రహ్మజ్ఞానము కలిగినంతనే, ఆత్మకానిదానిని ఆత్మగాభావించు తమ అజ్ఞానము నశించిపోయినదే! ఆహ! అని మునివరులు ఏస్వామిని దర్శించి ఆనందించెదరో అట్టి దేవుడు, ఈప్రపంచము కంటే వేరుగా ప్రకాశించుచున్నవాడగు దక్షిణామూర్తిని సేవించుచున్నాను.
25. దక్షిణామూర్తిమంత్రములోని అక్షరములు ప్రతీశ్లోకమునకు మొదట ఉంచి, మత్త మయూరవృత్తమునందు రచించబడిన ఈ స్తోత్రము ఆస్వామి యొక్క భంగిమను తెలియజేయుచున్నది. గురుసామ్రాట్టు, పరమాత్మయగు దక్షిణామూర్తి ఈ స్తోత్రమును దయతో అంగీకరించుగాక.
No comments:
Post a Comment